December 23, 2024

అనకాపల్లి నుంచి పవన్?

అన్న నాగబాబు అని అంతా అనుకుంటే ఆయన వారం రోజుల పాటు హడావుడి చేసి తప్పుకున్నారు. అనకాపల్లి ఎంపీగా నాగబాబు రంగంలో ఉంటారని అంతా ప్రచారం సాగింది. కానీ చివరికి మెగా బ్రదర్ కాదని తేలిపోయింది. ఇపుడు తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీకి దిగుతారు అని ప్రచారం సాగుతోంది.

అనకాపల్లి పరిధిలోని అసెంబ్లీ సీట్లను తమ పార్టీ వారికి ఇప్పించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారని అంటున్నారు. పెందుర్తి, అనకాపల్లి, ఎలమంచిలి, మాడుగుల సీట్లను జనసేన పొత్తులో భాగంగా తీసుకుంటుందని అంటున్నారు.

ఈ నాలుగు సీట్లు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోనే ఉండడం విశేషం. పంచకర్ల రమేష్ బాబుని పెందుర్తికి, అనకాపల్లికి కొణతాల రామక్రిష్ణ, ఎలమంచిలి సుందరపు విజయకుమార్ అభ్యర్ధులుగా నిర్ణయించారు. మాడుగులకు బలమైన అభ్యర్ధిని నిలబెడితే మెజారిటీ అసెంబ్లీ సీట్లలో జనసేనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారుట.

పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం పట్ల కూడా ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఆయన గత ఎన్నికల్లో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనను మళ్ళీ అక్కడ నుంచే పోటీ చేయమంటూ పార్టీ తీర్మానం కూడా చేసింది. పవన్ మాత్రం పిఠాపురం అసెంబ్లీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.

దాంతో పాటు ఆయన ఎంపీ సీటుగా అనకాపల్లిని ఎంచుకుంటారు అని అంటున్నారు. దాని వల్ల ఉత్తరాంధ్రాలో పార్టీకి ఊపు వస్తుందని అలా గోదావరి జిల్లాలతో పాటు ఇటు వైపు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని ఆయన చూస్తున్నారు అని తెలుస్తోంది. పవన్ కనుక అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తే రాజకీయ సామాజిక సమీకరణలు ఎలా మారుతాయో చూడాలని అంటున్నారు.

అనకాపల్లి ఎంపీ పరిధిలో వైసీపీ బలంగా ఉంది. తెలుగుదేశం సహకారం కూడా జనసేనకు చాలా అవసరం అవుతుంది. జనసేన కీలకమైన అసెంబ్లీ సీట్లు తీసుకుంటే తమ్ముళ్లలో రేగిన అసంతృప్తి కూడా కొంపముంచుతుంది అన్న ప్రచారం సాగుతోంది.