మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పాక్ నూతన ప్రధాని
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ 24వ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సోమవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో షరీఫ్‌కు మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
మోదీ ట్వీట్‌పై పాక్ ప్రధాని తాజాగా స్పందించారు. ఈ మేరకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘పాకిస్థాన్ ప్రధానమంత్రిగా నేను ఎన్నికైన వేళ అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’ అంటూ ఎక్స్ వేదికగా షరీఫ్ ఒక పోస్ట్ పెట్టారు. అదేవిధంగా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జాతీయ అసెంబ్లీలో తొలిసారి ఆయన ప్రసంగించారు. సమానత్వం ప్రాతిపదికన పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా షరీఫ్ స్పష్టం చేశారు.